Saturday, December 01, 2007

శ్రీ వేంకటేశ్వర దర్శనము

నమోశ్రీనివాసా! నమొ నమో శ్రీనివాసా!
నమో వేంకటేశా! నమొ నమో వేంకటేశా!!
శిఖను మెరిసిన నవరత్నఖచిత మకుట వెల్గులు
సాంద్ర నీల జీమూతన మెఱుపుబోలు!
సొగసు కనుబొమల కలుపు
నొసట నామంబు తెలుపు!
సోగకన్నుల సగము కప్పినొప్పు
చూడ నడుమ కస్తూరి తిలకంబు సొంపు! నమోశ్రీనివాసా
సొగపు సంపెంగ నాసికాగ్రము
చెక్కిళ్ళటద్దాల వెల్గెటి ముకుందము!
సుధలు చిందెటి అధరంబున
నెలవంక తొంగిచూసిన ముత్యాల దంతపంక్తి!
సొంపైన చుబుకంబుతెలుపు
భక్తిరక్తికి పొందిన లాంఛనంబు నమోశ్రీనివాస
మెడపైన మణిహారములు దీప్తిలెసగ
ఓహో మేలైన మేని నలుపు!
ఇంపైన శంఖ చక్రంబులు
కుడి ఎడమ భుజముల బలుపు!
అగ్ని సాక్షిగ వక్షంబు నిలయ "లచ్చి"
ఆహా! హ్రుదిలోని వలపు సాక్షి! నమోశ్రీనివాస
పచ్చల కెంపులద్దిన పతకంబు
యురముపై కాంతులీనుచునుండ
విమల యజ్ఞోపవీతంబు "వేది"యై
వామభుజముమీదుగ నాభిచేరె నమోశ్రీనివాస
మణిబంధ రత్న కడియములు మెరయు
తరణి మెరసిన క్రణంబు కరణి!
ధర్మదండము దక్షిణహస్తంబవధరించి
ధరణినేలుట నాదె ధర్మమనుచు!! నమోశ్రీనివాస
పట్టుశ్వేతాంబరపు పచ్చంచు కుచ్చులు
కటిసూత్రముగ చుట్టి
చరణకంకణంబుల చుంబించుచుండె!!
పసిడికాసుల పేరులు వడ్డికాసుల సిరులు
పైనుండి క్రిందికి జీరాడుచుండె
పుష్పాల చేరులు తరుల ముడుపుల విరులు
మృదుల పాదల తాకుచుండె! నమోశ్రీనివాస
పున్నాగ సంపెంగ పూదండ
మకరకుండల మండలంబును చుట్టి
ఇరువైపు శంఖచక్రాలమీదుగ భువినిచేరె!
వజ్ర వైఢూర్య శోభిత వరదహస్తంబు
చూపునదె దివ్యచరణారవిందసీమ!! నమోశ్రీనివాస
వేయివెల్గుల రేడు శ్రీవేంకటెశ్వరుడు!
వెల్గుచున్నాడు నేడు వేంకటరమణుండు నమోశ్రీనివాస

ఫలశృతిః
అందములుచిందు ఆర్తజనరక్షకుండు
ఆనందవందారువు స్వామి! సర్వాంగ సుందరాంగుడు
అవని వందితుండు వాడె! సుధాతరంగ రంగడు!
ఇట్టి వేంకటెశ్వరు దర్శించు నిత్యము
ఇలలోన ఏవ్వరేని రేయిబగలు
అట్టివారికి నెల్లసకల సౌభాగ్యములుకూడి
నిశ్చల జ్ఞానంబు కల్గు నిశ్చయంబుగ!!!

"సర్వేజనాః సుఖినో భవంతు" -
శుభంభూయత్!

Written by -
Prasad Komarraju

Composed by -
Rao Pamganamamula

No comments: